Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్..

 


ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బహిష్కృత మంత్రి ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లలేదని, అలాంటి ఉద్యమ నాయకులు మామూలు మనిషినైన తన మీద తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని అన్నారు. 

భూకబ్జా పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని ఆరోపించారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

 ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుపట్టారు.


నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఏమాత్రం తప్పున్నా తనను శిక్షించాలన్నారు. 


ఉద్దేశ పూర్వకంగానే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని వ్యాఖ్యానించారు.

 అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కాదని, అది తన కొడుకు, కోడలికి చెందినదని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

 ప్రభుత్వంలో ఒక కమిట్‌మెంట్‌తో పనిచేశానన్న ఈటల.. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని చెప్పుకొచ్చారు. నాకు సంబంధం లేని భూముల్లో సర్వే చేశారని ఆరోపించిన ఈటల రాజేందర్.. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదన్నారు. నోటీస్ ఇవ్వకుండా సర్వే చేసినందుకు కోర్టుకు వెళ్తానని ఈటల స్పష్టం చేశారు.

 సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారన్న ఆయన.. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానని వ్యాఖ్యానించారు. 

వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థ శాశ్వతం అని పేర్కొన్నారు. భూముల వ్యవహారంలో సంబంధిత గ్రామ సర్పంచ్ ఉదయం ఒక మాట చెప్పారు.. సాయంత్రానికి ఒక మాట మార్చారని ఈ సందర్భంగా ఈటల గుర్తు చేశారు.


ఆ తమ్ముడు ఇప్పుడు దెయ్యం అయ్యాడా?..
నయీం గ్యాంగ్ తనను చంపేందుకు రెక్కీ నిర్వహించిందన్న ఈటల రాజేందర్.. అప్పుడే భయపడలేదని, ఇప్పుడు భయపడుతానా? అని వ్యాఖ్యానించారు. ‘ఈటల నా తమ్ముడు అని చెప్పుకున్నారు కదా?.. ఇప్పుడు ఆ తమ్ముడు దెయ్యం అయ్యాడా?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈటల సూటిగా ప్రశ్నించారు. మానవ సంబంధాలు శాశ్వతమని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ హితవు చెప్పారు.



పార్టీ పెట్టే ఆలోచన లేదు..
సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్‌తో కలిసి పని చేసినంత కాలం ఒక్కపైసా కూడా సంపాదించలేదని స్పష్టం చేశారు. 2008లో పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేశానని, పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించానని పేర్కొన్నారు. పార్టీకి నష్టం చేకూర్చే పని ఏనాడు చేయలేదన్నారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్నంతా ఉపయోగించారని అన్నారు.


గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని, ప్రజల ఆమోదం ఉంటేనే గెలుస్తారని వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందన్న ఈటల.. కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post